తాతయ్య

తాతయ్య-సత్యనారాయణ.

ముద్దుగా ఉండేవాడు, బాగా మాట్లాడేవాడు.
ఆయన ప్రేమ ఎలాంటిదో ముందే పసిగట్టే ఛాన్స్ ఉండి ఉంటే తాత అనే ముందు పలికేదాన్నేమో. అంతకు తక్కువేం జరగలేదు. నాకు గుర్తున్నంతవరకూ నేను అమ్మ, నాన్న అనే పదాలకన్నా ఎక్కువగా పలికిన పదం 'తాత'.

మా తాతయ్య చాలా అందగాడు. నల్లని కళ్ళు, కొటేరు ముక్కు, బట్టతల అయిన కూడా అందమైన బట్టతల, పల్చని చేతులు, సన్నని కాళ్ళు, మనిషి పిసరంత కూడా వంగిపోలేదు రూపంలోనూ, ఆత్మాభిమానంలోనూ. గుడ్డిగా ప్రేమించడం, తిరిగి మనకి మంచి వచ్చినా, చెడు వచ్చినా ప్రేమిస్తే పోలే అనుకునే అంత పసిపిల్లాడి మనసు ఆయనది. 'గాజుబొమ్మని సాకినట్టు సాకాడు పిల్లని' అని మా వీధి వాళ్ళు అనుకుంటుంటే ఓ వందసార్లు మాములుగా విని ఉంటాను. అవును. ఒప్పుకుంటాను.

ఎన్ని తప్పులు చేసినా వెనకేసుకొచ్చేవాడు. ఎంతలా అంటే స్కూల్లో ఓసారి నా ఫ్రెండ్ని కొడితే వాళ్ళమ్మ మా ఇంటికి గొడవకు వచ్చినప్పుడు 'మా అమ్మాయి కొట్టలేదంట, మీ వాడే వచ్చి దాని చెయ్యికి తగిలాడంట!' అనే అంత వెనకేసుకొచ్చాడు. ఇంకంతే ఎన్ని తప్పులు చేశానో, అవి తప్పులో ఒప్పులో కూడా తెలీనంత ధీమాగా మనసుకి అనిపించింది చేసేశాను. ఇప్పుడు ఏదైనా చెయ్యాలంటే భయంగా ఉంది తాతయ్య. అది తప్పో ఒప్పో తెలీదు, పొరపాటున తప్పైతే వెనకేసుకు రావడానికి నువ్వు లేవు.

నాకు నాలుగైదు ఏళ్ల నుండి టీ తాగడం నేర్పించావు. అంటే నువ్వు తాగుతుంటే వచ్చి నీ చుట్టూ తిరిగేదాన్ని, రుచిమరిగాను, అలవాటు పడిపోయాను. ఇద్దరం కలిసి ప్రతిరోజు సాయంత్రం మన ఇంటి వెనకున్న చిన్న అరుగు మీద కూర్చొని టీ తాగేవాళ్ళం. నీకు పెద్ద గ్లాసు, నాకు చిన్న గ్లాసు.  నా నోరు కాలిద్దేమో అని రెండు చిన్న గ్లాసులో వడకొట్టి, చల్లార్చి చేతికందిస్తే గుటుక్కున మింగేసేదాన్ని.
తాగి ఏదో సాధించినట్టు ఎంప్టీ గ్లాసు నీకు తిరిగిచ్చి, 'చూడు ఫస్ట్ తాగేసా!' అనేదాన్ని. అలా టీ అయిపోయేదాకా నేను ఫస్ట్ వచ్చేదాన్ని టీ తాగే పోటీలో. నువ్వు నాతోపాటే టీ తాగుతూ, నన్ను గెలిపిస్తూనే ఉండేవాడివి. ఈ అలవాటు నేను నీకు దూరంగా చదువుల కోసం హైద్రాబాద్ వచ్చేవరకూ ఉంది. సెలవలకొచ్చినప్పుడు కూడా అదే తంతు. రోజుకు ఆరేడు సార్లు టీ తాగితే ఆరోగ్యానికి మంచిది కాదు అని నా చుట్టూ ఉన్నవాళ్లు అంటే వాళ్లకి ఎలా చెప్పాలి నిన్ను ఆ అలవాటులో చూసుకుంటున్నానని. నాకిప్పుడు 22 ఏళ్ళు, అయినా కూడా రెండు చిన్న చిన్న గ్లాసులో టీని వడపోసి, ఊదుకొని, మెల్లిగా చప్పరిస్తాను. టీ గ్లాసు చూసినప్పుడల్లా రెండు నెలలుగా కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి తాతయ్య.

స్కూల్ అలవాటు కాడానికి నాతో పాటే నువ్వు తయారయ్యి స్కూల్ బయటే కుర్చీ వేయించుకుని కూర్చొనేవాడివి. ఎంత మంది పొమన్న కదిలేవాడివి కాదు. టీచర్ అడిగితే 'పిల్ల మధ్యలో వచ్చి చూసుకుంటే, నేను లేకపోతే, గుక్కపట్టి ఏడుస్తది' అన్నావంట. ఆ టీచర్ ఇప్పటికీ చెప్తది. స్కూల్ అలవాటు అయ్యాక, స్కూల్ బాగ్ సర్దడం దగ్గర నుండి స్కూల్ బస్ ఎక్కించే వరకు హడావిడి అంతా నీదే. సాయంత్రం బస్ దిగి ఇంటికొచ్చి, మొహం కడుక్కొని, టీ తాగి, హోమ్ వర్క్ చేసి, ఆడుకొని, నిద్రపోయే ముందు జో కొట్టే వరకు నువ్వే.

సైకిల్ తొక్కడం నాకు సరదా, ఎక్కడ కిందపడతానో అని నీకు భయం. ఇంటి ముందు కుర్చీ వేసుకొని కూర్చొని మరీ 'బుడ్డిదానా! నేను చూస్తున్న, ఈ చివరి నుండి ఆ చివరి వరకు రెండు చుట్లు తొక్కి సైకిల్ లోపల పెట్టాలి!' అని ఎన్ని సాయంత్రాలు అలా నా సైకిల్కేసి చూస్తూ ఎదురుచూస్తుండిపోయావో నాకు గుర్తే. ఎన్ని తిట్టుకునేదాన్నో 'తాతయ్య ఎందుకిలా చేస్తాడు?' అని. ఇపుడు నా వంటి మీద ఉన్న ప్రతిగాయపు మచ్చ నీ బెదిరింపునే గుర్తు చేస్తుంది. ఆ రోజు నీ మాట విని ఉంటే నాకీ రోజు ఈ గాయాలు, మచ్చలు ఉండేవికావు. నీ బెదిరింపులు గుర్తొచ్చేవి కావు. తాతయ్య, బండి కొనుక్కుందాం అనుకుంటున్నా, కిందపడతానేమో, వద్దని గద్దించవూ!

నాకు 8 ఏళ్ల వయసున్నప్పుడు ఒక్కసారి చెప్పినమాట వినలేదని కొట్టావు, గుర్తుందా! తొడ మీద నీ చేతి అచ్చు పడింది. గుక్కపట్టి ఏడ్చాను. తర్వాత మళ్ళీ నువ్వు కొట్టినట్టు నాకు గుర్తులేదు. పదేళ్ల తర్వాత అంటే నాకు 18 ఏళ్ళు ఉన్నప్పుడు ఓ మాట నానమ్మతో అన్నావు. 'ఆనాడు పిల్లని కొట్టినందుకు ఈనాటికి ప్రాణం గుంజుతుంటది' అని. నాకు కనీసం నువ్వు కొట్టిన సంగతి కూడా గుర్తులేదు. మళ్ళీ నువ్వు చెప్పిన మాట వినను, చాచి కొట్టడానికైనా రారాదు.

నీ సంతకం పక్కనే కూర్చోబెట్టుకొని మరీ నాకు నేర్పించావు. ఎపుడైనా నువ్వు సంతకం చేయడం మర్చిపోతే టీచర్ కొట్టకుండా స్కూల్ డైరీ లో సైన్ చేసుకోమన్నావు. కానీ నేను దాన్ని ప్రోగ్రెస్ కార్డ్ లో కూడా పెట్టేస్తున్నా అని తెలిసి కూడా ప్రతీ పేరెంట్-టీచర్ మీటింగ్లో నాతో కలిసి టీచర్లకు అబద్ధాలు చెప్పావు.
లేని జ్వరం వల్ల మార్కులు తగ్గాయనీ ఓ సారి, ఆల్రెడీ చనిపోయిన మీ అన్నయ్యని నా పరీక్షలప్పుడు చనిపోయాడని చెప్పావు. 'మార్కులొచ్చినా రాకపోయినా పిల్ల ఒంటి మీద చెయ్యి పడితే ఊర్కోను' అని స్కూల్ అంత వినపడే అంత గట్టిగా వార్నింగ్ ఇచ్చావు మా టీచర్లకి. చిన్నపాటి ప్రిన్సెస్ లా ఫీల్ అయ్యేదాన్ని అప్పట్లో. చాలా ఒంటరిగా ఉన్నట్టుంది తాతయ్య. నువ్వు లేకపోతే నేను జీరో ఐపోయినట్టు ఉంది.

ఎంత నరకం చూపించానో నీకు, నేను నా టీన్స్లో ఉన్నప్పుడు. ఇంట్లో అందరూ కసిరేవాళ్ళు నేను చేసే చిరాకుకు. నువ్వే అంత ఓపికగా ప్రేమించావు అప్పుడు కూడా. అప్పుడప్పుడే పీరియడ్స్ నొప్పి మొదలైంది. కడుపు పట్టుకొని గిలా గిలా కొట్టుకునేదాన్ని. ఎన్ని సార్లు నా ఏడుపు చూసి నువ్వు ఏడిచావో గుర్తుందా! 'ఆడపోరాగాళ్ళకి ఈ నొప్పులెందుకు పెట్టినవ్?' అని పైకి చూసి నువ్వు నమ్మిన దేవుడ్ని ఎన్ని సార్లు అడిగినవో గుర్తుందా! 'బుడ్డిదానా ఆ విష్పరో గిష్పరో నాకు నోరు పలకట్లేదు పేపర్ మీద రాయి పట్టుకొస్తా!' అని ఎన్ని సార్లు అడిగినవ్ గుర్తుందా! నెల నొప్పికి ఓపిక లేక కళ్ళు తిరిగి కింద పడ్డ రోజున ఎంత తల్లడిల్లినవో గుర్తుందా! చచ్చిపోతా అని బయపడినవంట. చెవుల్లో, నోట్లో గాలి ఊదినవంట. కళ్ళు తెరిచేదాకా చేతులూ, పాదాలు రుద్దుకుంటూ కూర్చున్నావంట. నొప్పింకా తగ్గలేదు తాతయ్య. అప్పుడు నాతో కలిసి నువ్వూ ఏడిచేవాడివి ఇప్పుడు ఒక్కదాన్నే ఏడిచి ఓ టాబ్లెట్ మింగుతున్న.

ఇక్కడికి చదువులకు వచ్చేసాక దూరం పెరిగింది. అయినా కూడా దూరమైపోలేదు. ఫోన్ చేయగానే ఎవరు ఫోన్ లిఫ్ట్ చేసినా నేను హలో కూడా చెప్పకుండా అనే మాట 'ఫోన్ తాతయ్యకి ఇవ్వండి' అని. బోసి నవ్వులు నవ్వేవాడివి నా గొంతు విని. తింటున్నవా తింటున్నవా అని వంద సార్లు అడిగేవాడివి. ఎందుకెళ్లిపోయావ్ తాతయ్య నాకు ఆకలెయ్యట్లేదు! ఎప్పుడొస్తావ్ అని నువ్వు అడిగినప్పుడు పరిక్షలనీ, ఫ్రెండ్సని చెప్పిన మాటలు గుర్తొస్తే ప్రాణం పోతోంది తాతయ్య. ఇప్పుడు అలా పిలిస్తే పరిగెత్తుకు వచ్చేస్తాను. కానీ లేవు. పిలవవు.

'నేనెళ్లిపోతే నువ్వెట్ల బతుకుతావే బుడ్డి?' అని అడిగాడు ఓ సారి. వెళ్లిపోవడం అంటే ఏంటో తెలియని వయసులో 'ఎక్కడికెళ్తావ్ తాత! నేనొస్తా!!' అన్నాను. రానీలేదు నన్ను నీతో పాటు, ఒక్కడివే వెళ్లిపోయావు.

చిన్నప్పటినుండి నేను నీ దగ్గరే నిద్రపోయేదాన్ని. జో కొట్టి నిద్రపుచ్చేవాడివి. నిద్ర మధ్యలో నా గౌన్ ఎగిరి పక్కకు జరిగితే 'పిచ్చిముండకు ఒంటి మీద సోయే లేదు, ఎట్ట బతుకుతదో!' అనుకుంటూనే జో కొట్టావు ఓ సారి. నేను సగం నిద్రలో విన్నాను. 'బంగారు లచ్చక్కో, పిచ్చి ముత్తెమ్మో!' అని ఏవేవో రాగాలు తీసి రెండు లైన్ల పాటలు పాడేవాడివి. నీ గొంతు రికార్డ్ చేసి పెట్టుకోవాల్సింది. రెండు నెలలుగా వినిపించట్లేదు. బాధగా ఉంది తాతయ్య. అలా ఎలా వదిలేసి వెళ్లిపోతావు నన్ను. భయమేస్తోంది బతకాలంటే. "ఆ ఏంటంటా అయితే ఇపుడు! చెయ్యలనిపించింది చేసేశా. ఏదైనా అయితే మా తాతయ్య చూస్కుంటాడులే" అని ఒక ధీమా ఉండేది. ఇప్పుడది పోయింది. భయం భయంగా ఉంది.

కౌమారదశలో చేసిన పిచ్చి పనిని చూసి కూడా కళ్ళ నిండా నీళ్లు పెట్టుకున్నావు కానీ ఒక్క మాట అడగలేదు. అడగకుండా ఉండి చెంప మీద చాచి కొట్టావు, కళ్ళ నీళ్లు పెట్టుకొని నేనేం చేశానో అర్ధమయ్యేలా చేసావు. మళ్ళీ అటు వైపు పోలేదు. ఎంతమంది పిల్లలు ఇంత ప్రేమ పొందారో తెలీదు నేనైతే నూరుశాతం ప్రేమ పొందాను.

నాకు వయసు పెరుగుతుందని నాకు తెలిసింది. కానీ నీకు వయసు పెరుగుతుందని కొద్దిరోజులే ఉంటావనే సంగతే నా బుర్రలోకి రాలేదు. నా తాతయ్య, నా చిట్టి కన్నయ్యే, నా బంగారమే, నా ముసలోడే, నా బుడ్డోడే అనే ధీమా. కానీ చూస్తూ చూస్తుండగానే సన్నగా ఐపోయావు.  బలం కోల్పోయావు. చూడాలంటే గుండె దడ పుట్టేది. అందుకే రాలేకపోయాను. భయపడి. కానీ నీ ప్రాణం ఎంత ఆరాటపడి ఉంటదో నన్ను కలవాలని మాట్లాడాలని అర్ధం చేస్కోలేకపోయా.  "ఎలా ఉన్నావు తాతయ్య అంటే అలానే ఉన్నాను" అనే మాటని నా చెవులు తీస్కోలేకపోయాయి. కావాలని అన్నం మానేశావు. ఎవరితో సేవలు చేయించుకోను అని నిక్కచ్చిగా చెప్పి కావాలని చావుని పిలిచావు. ఓ రోజు వెళ్లిపోయావు.

నీకు చలి పడదు. అలాంటిది నిన్ను ఆ చల్లటి బాక్స్ లో పెట్టి ఒక రోజంతా ఉంచారు. నిన్ను అంత దగ్గరగా కదలకుండా పడి ఉండటం చూశాను. నీ కళ్ళు కదలలేదు, చెయ్యి కదలలేదు, చూపు నిలిచిపోయింది, ఆ చల్లటి బాక్స్ లో నువ్వు. పైన కొన్ని పూలదండలు. వాటిని జరుపుతూ నీ మొహాన్ని చూస్తూ నేను. నీకు నాకు మధ్యలో ఆ గ్లాసే అడ్డం. అమాంతం నీ మొహాన్ని కప్పేస్తూ నా మొహం. వచ్చిన వాళ్ళని చూడనివ్వట్లేదు అని అన్నారు. అయినా కూడా కదలలేకపోయాను. ఎందుకంటే నువు నాకు మిగిలింది ఆ నాలుగు గంటలే. ఉన్న పిల్లలందరిలో నీకు నేనంటేనే ఎక్కువ ఇష్టంకదా. అందుకే నీ పక్కనే కూర్చున్నాను. లేవలేదు. కదలలేదు. పిలిచాను. వేలసార్లు పిలిచాను.ఆ అద్దాన్ని తడిమి తడిమి పిలిచాను. తాతయ్య తాతయ్య అని ఏడుచుకుంటు పిలిచాను. నువ్వు కదలలేదు. నేను పిలవడం ఆపలేదు. నీ మొహాన్ని చూస్తూ కూర్చున్నాను. నిన్ను ఆ బాక్స్ లో నుండి బయటకు తీశారు. కదలకుండా వాళ్ళు ఎలా కదిపితే అలా కదులుతున్నావు. నీ చేతులు నీ కళ్ళు ఎందులోనూ జీవం లేదు. స్నానం చేయించారు నీకు. నిన్నే పట్టుకొని, నీ తల వంగిపోకుండా నేను గట్టిగా పట్టుకున్నాను. చలిని అసహ్యించుకునే నువ్వే గడ్డకట్టుకుపోయావు. నా ప్రాణం బిగుసుకుపోయింది. అందరూ దండాలు పెట్టి, కాళ్ళు మొక్కుతున్నారు. నా వల్ల కాలేదు. రేపటినుండి ముట్టుకోడానికి ఈ చేతులుండవ్, ముద్దు పెట్టి విసిగించడానికి నీ బట్టతల ఉండదు, నువ్వు తాగే పొగ వాసన ఉండదు. ఏది ఉండదు. ఏం చేయాలి నేను. మెల్లిగా బుగ్గల మీద ముద్దు పెట్టుకున్నాను. చల్లగా ఉన్నావ్. ఎప్పటిలాగే తుడుచుకోకుండా కదలకుండా ఉన్నావ్. తలపైన ముద్దు పెట్టుకున్నాను, చలనం లేదు. చేతులు, వేళ్ళు, కాళ్లతో సహా ముద్దు పెట్టుకున్నాను. అయినా నువ్వు కదలలేదు. కొత్త బట్టలేశారు. చాలా అందంగా ఉన్నావు. నిన్ను తీస్కెళ్ళిపోతున్నారు ఇంకా. నాకేం అర్ధంకాలేదు. పిచ్చెక్కిపోయింది. నిన్నటివరకూ అలా మంచంలో ఉన్న మనిషి ఉన్నట్టుండి ఇలా రోడ్ మీద, పాడే పైన. నాకేం అర్ధంకాలేదు. నడుస్తున్నారు, నడుస్తున్నారు. దూరంగా. నీ చేతి కర్ర పట్టుకొని, నీ తల పక్కనే నీ మీద పడే పూలని తొలగిస్తూ నేనూ నడిచాను. నీ తల అదుపు తప్పి అటు ఇటు పడిపోతుంటే నేనే చేతులతో పట్టి నడిచాను. ఓ చోట ఆపారు. చెవిలో పిలవమన్నారు. నేను కూడా పిలిచాను. నాన్న అని కాదు, తాత తాత తాత అని మూడు సార్లు. నాన్న అని ఆయన పిలిచినా పలకలేదు, తాత అని నేను పిలిచినా పలకలేదు. చివరి ఆశ చచ్చిపోయింది. నువ్వింక లేవు. కట్టెలు సర్దుతున్నారు. నిన్ను దానిపైన పడుకోబెట్టాలని. అయ్యో అయ్యాయో నా కళ్ళ ముందే నిన్ను బోర్లా పడుకోబెట్టేశారు ఆ కట్టెల పైన. 'మా తాతయ్యకి ఆ కట్టెలు మొహం మీద గుచ్చుకుంటాయి. మాములుగా ఉంచండి' అని వాళ్ళని అరవాలనిపించింది. వాళ్ళు వినరు. నీ చేతి కర్ర నీకు ఇచ్చేసాను. మెల్లిగా వణుకుతూ ఒక చెయ్యి నువ్వున్న కట్టెలకి మంట పెట్టింది. అందరి ఏడుపులు మాయమయ్యాయి. నా కళ్ళ ముందే నువ్వు కాలిపోతున్నావు. అక్కడ ఉండకూడదని గెంటేశారు. వెనక్కి చూస్తూనే ముందడుగు వేసాను. ఆ కట్టెల సందులోనుండి నేను ప్రేమగా ముద్దాడే ఆ బట్టతల కనిపించింది. ఆ చర్మం నా కళ్ళ ముందే మంటతో కలిసి కాలిపోయి మాంసం కనిపించింది. ఆ రక్తం చూసి భయమేసి ఇటు తిరిగాను. నాకు అర్ధమైంది. ఇక నుండి ఒంటరిగా బతకాలని. రెండు నెలలుగా ప్రయత్నిస్తూ, విఫలామవుతూ, మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూ...

నిన్ను ఈ నాలుగు పేరాల్లోకి ఇరికించలేను. మన ప్రేమని అందరికీ అర్ధమయ్యేలా చెప్పలేను. నువ్వు చందమామలోకి దూరిపోయావని నన్ను నేను నమ్మిస్తున్నాను.  ఊరికే ఆకాశాన్ని చూస్తూ సాయంత్రాలు గడిపేస్తున్నాను. చాలా ఏడుపోస్తుంది తాతయ్య. బోలెడు సార్లు కలల్లోకి వస్తున్నావు. కలలో ఏడుస్తున్నానో నిజంగానే ఏడుస్తున్నానో తెలిట్లేదు. ఇదిగో నువ్వు గుర్తొచ్చినప్పుడల్లా నీ చొక్కా వేసుకొని ఒక్కదాన్నే నీతో మాట్లాడుతూ కళ్ళు తుడుచుకుంటున్నాను.

Comments

  1. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. మా తాత తో కూడా same ఫీలింగ్స్, మనం కూడా మన ముందు తరాల వాళ్ళకి అందించాలి.

      Delete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. సత్యా !
    Exllent write up తల్లీ.
    కోల్పోతున్న మానవీయ బంధాలను తిరిగి స్పర్శింప చేసావమ్మా.
    All the best

    ReplyDelete
  4. మనం ప్రేమించినోళ్ళనూ,మనల్ని ప్రేమించినోళ్ళని కోల్పోవడం కన్నా జీవితంలో ఇంకేమీ పెద్ద లాస్ ఏమి ఉండదనుకుంటా....
    అదో ఎమోషన్ అంతే..
    రాస్తేనో,చెప్తేనో సరిపోయేది కాదది.

    ReplyDelete
  5. Where to buy titanium trim - The Tithuan Bandar
    In westcott scissors titanium Vietnam, when the Viet Nam and China titanium legs invaded, the Tu-Chin Chin Chins titanium touring made it 토토사이트 their way to titanium jewelry for piercings the north for the first time ever.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Love that comes back

అసీఫా